Friday, September 20, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీభగవానువాచ
వనం వివిక్షుః పుత్రేషు భార్యాం న్యస్య సహైవ వా
వన ఏవ వసేచ్ఛాన్తస్తృతీయం భాగమాయుషః

వానప్రస్థానికి వెళ్ళదలచుకుంటే భార్యను పిల్లలకు అప్పగించవచ్చు లేదా తన కూడా తీసుకు వెళ్ళవచ్చు. ఆయుష్యములో మూడవ భాగం వరకూ వానప్రస్థం చేయాలి.

కన్దమూలఫలైర్వన్యైర్మేధ్యైర్వృత్తిం ప్రకల్పయేత్
వసీత వల్కలం వాసస్తృణపర్ణాజినాని వా

కందమూల ఫలములు తింటూ, నార వస్త్రములు కట్టుకుని, ఆకుల మీదా, గడ్డి మీదా, చర్మాల మీదనే పడుకోవాలి.

కేశరోమనఖశ్మశ్రు మలాని బిభృయాద్దతః
న ధావేదప్సు మజ్జేత త్రి కాలం స్థణ్డిలేశయః

కేశములనూ రోమములనూ నఖములనూ మీసములనూ గడ్డములనూ తీసుకోరాదు
పరిగెత్తకూడదూ, నీటిలో మునగకూడదు, మూడు పూటలా స్నానం చేయాలి, భూమి మీదనే పడుకోవాలి

గ్రీష్మే తప్యేత పఞ్చాగ్నీన్వర్షాస్వాసారషాడ్జలే
ఆకణ్థమగ్నః శిశిర ఏవం వృత్తస్తపశ్చరేత్

వేసవి కాలములో ఐదు అగ్నుల మధ్యన పడుకోవాలి. పైన సూర్యుడూ, నాలుగు వైపులా నాలుగు అగ్నులూ ఉండాలి
వర్షాకాలములో వర్ష ధారముల కింద కూర్చునీ, చలికాలములో కంఠం వరకూ నీటిలో ఉండి తపస్సు చేయాలి

అగ్నిపక్వం సమశ్నీయాత్కాలపక్వమథాపి వా
ఉలూఖలాశ్మకుట్టో వా దన్తోలూఖల ఏవ వా

అలవాటు లేకుండే పొయ్యి మీద వండుకు తినవచ్చు. కానీ కంద మూలాలూ పళ్ళూ కాయలూ, కాలముచేత పక్వం చేయబడే వాటినే తినాలి.
ఏ పూటకు ఆ పూట ధాన్యాన్ని తానే రోటితో దంచాలి. లేదా రాయితో దంచి తినాలి. లేదా పంటితోనే గింజలను వలిచి వాటిని తినాలి.

స్వయం సఞ్చినుయాత్సర్వమాత్మనో వృత్తికారణమ్
దేశకాలబలాభిజ్ఞో నాదదీతాన్యదాహృతమ్

తాను బతకడానికి కావలసిన దాన్ని తానే స్వయముగా సంపాదించుకు తినాలి (భార్య ఉన్నా). దేశ కాల బలాలు బాగా తెలిసినవాడు ఇతరులు తెచ్చిన దాన్ని స్వీకరించడు

వన్యైశ్చరుపురోడాశైర్నిర్వపేత్కాలచోదితాన్
న తు శ్రౌతేన పశునా మాం యజేత వనాశ్రమీ

అడవిలో లభించిన చెరువుతో, పురోడాశముతోనే హోమం చేయాలి.
వానప్రష్తం వారు శ్రౌత విధిలో పశువులతో యజ్ఞ్యం చేయరాదు

అగ్నిహోత్రం చ దర్శశ్చ పౌర్ణమాసశ్చ పూర్వవత్
చాతుర్మాస్యాని చ మునేరామ్నాతాని చ నైగమైః

వేదములు వానప్రస్థానికి అగ్నిహోత్రమూ దర్శ పౌర్ణమాస చాతుర్మాస్యం అనే నాలుగు వ్రతాలు మాత్రమే ఏర్పాటు చేసారు

ఏవం చీర్ణేన తపసా మునిర్ధమనిసన్తతః
మాం తపోమయమారాధ్య ఋషిలోకాదుపైతి మామ్

ఇలా చేస్తే ఎముకల గూడు అవుతాడు

ఈ విధముగా చేస్తే ఎముకుల గూడు అవుతాడు.
తపో రూపములో నన్ను ఆరాధించి ఈ లోకాన్ని విడిచి నన్ను చేరతాడు

యస్త్వేతత్కృచ్ఛ్రతశ్చీర్ణం తపో నిఃశ్రేయసం మహత్
కామాయాల్పీయసే యుఞ్జ్యాద్బాలిశః కోऽపరస్తతః

నన్ను మాత్రమే చేరడానికి కారణమైన ఇంత అద్భుతమైన వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి, ఇంతటి కఠినమైన దీక్షా వ్రతాన్ని ఆచరించి సామాన్య కామనలకు ఈ శక్తిని ఉపయోగిస్తే అంతకన్నా భ్రష్టుడు ఇంకెవరు.

యదాసౌ నియమేऽకల్పో జరయా జాతవేపథుః
ఆత్మన్యగ్నీన్సమారోప్య మచ్చిత్తోऽగ్నిం సమావిశేత్

వృద్ధాప్యం బాగా పెరిగి, వణుకు వచ్చి నియమాలు పాటించలేకుంటే ఈ ఆత్మలో అగ్నిని ఏర్పాటు చేసి తాను అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టవచ్చు.

యదా కర్మవిపాకేషు లోకేషు నిరయాత్మసు
విరాగో జాయతే సమ్యఙ్న్యస్తాగ్నిః ప్రవ్రజేత్తతః

నరకములనిపించే కర్మ విపాకములైన లోకముల యందు విరక్తి కలిగితే అగ్నిని తనలో ఉంచుకుని సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు

ఇష్ట్వా యథోపదేశం మాం దత్త్వా సర్వస్వమృత్విజే
అగ్నీన్స్వప్రాణ ఆవేశ్య నిరపేక్షః పరివ్రజేత్

చెప్పిన రీతిలో యజ్ఞ్యం చేసి, ఋత్విక్కులకు అన్నీ ఇచ్చి, అగ్నిని తనలో ఉంచుకుని, దేనినీ కోరకుండా సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలి.

విప్రస్య వై సన్న్యసతో దేవా దారాదిరూపిణః
విఘ్నాన్కుర్వన్త్యయం హ్యస్మానాక్రమ్య సమియాత్పరమ్

సన్యాసం స్వీకరించాలి అనుకునే బ్రాహ్మణునికి దేవతలే భార్యా రూపములో వచ్చి విఘ్నాలు కలిగిస్తారు
వీరిని ముందు వశములో ఉంచుకునే తరువాతి ఆశ్రమానికి చేరుకోవాలి

బిభృయాచ్చేన్మునిర్వాసః కౌపీనాచ్ఛాదనం పరమ్
త్యక్తం న దణ్డపాత్రాభ్యామన్యత్కిఞ్చిదనాపది

సన్యాసములో ఒక్క కౌపీనం మాత్రమే ధరించి ఉండాలి, (ఆపద లేనపుడు తప్ప) దండమూ కమండలమూ తప్ప మరి దేన్నీ ధరించకూడదు

దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలమ్
సత్యపూతాం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్

ముందర అడుగుపెట్టాలంటే కంటితో చూసే అడుగుపెట్టాలి
నీరు త్రాగాలంటే వస్త్రమును పెట్టి వడబోసుకుని తాగాలి
సత్యముతో పవిత్రమైన మాటలే మాట్లాడాలి
మనసుతో నిష్కర్ష చేసి దాన్ని ఆచరించాలి

మౌనానీహానిలాయామా దణ్డా వాగ్దేహచేతసామ్
న హ్యేతే యస్య సన్త్యఙ్గ వేణుభిర్న భవేద్యతిః

వాక్కుని వశములో ఉంచాలంటే మౌనముతో శిక్షించాలి
అలాగే మనసును వైరాగ్యముతో, శరీరాన్ని ప్రాణాయామముతో శిక్షించాలి
ఇవి లేకుంటే మూడు వెదురుబొంగులు (త్రిదండాలు) పట్టుకున్న ప్రతీవాడూ సన్యాసి కాడు
ప్రాణాయామము నిరాసక్తీ మౌనమూ ఉన్నవాడు యతి అవుతాడు. అవి లేని వాడు యతి కాలేడు

భిక్షాం చతుర్షు వర్ణేషు విగర్హ్యాన్వర్జయంశ్చరేత్
సప్తాగారానసఙ్క్లృప్తాంస్తుష్యేల్లబ్ధేన తావతా

యతి కూడా నాలుగు వర్ణాలలో బిక్షాటనం చేయకూడదు. భిక్షాటనం తప్పకుండా చేయాలంటే రోజుకు ఏడు ఇళ్ళకు మాత్రమే వెళ్ళాలి. ఆ ఏడు ఇళ్ళలో ఎంత దొరికితే అంతటితోనే తృప్తి పొందాలి

బహిర్జలాశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యతః
విభజ్య పావితం శేషం భుఞ్జీతాశేషమాహృతమ్

ఊరిలో ఉండరాదు. ఒక వేళ ఉన్నా, ఊరి అవతల ఉన్న జలాశయానికి వెళ్ళి స్నానం చేసి మౌనముతో ఆచమనం చేసుకుని పవిత్రమైన దాన్నే విభజించి భుజించాలి

ఏకశ్చరేన్మహీమేతాం నిఃసఙ్గః సంయతేన్ద్రియః
ఆత్మక్రీడ ఆత్మరత ఆత్మవాన్సమదర్శనః

సన్యాసి ఒక్కడే తిరగాలి. ఎవరి యందు దేని యందూ కోరిక లేకుండా, ఇంద్రియ నిగ్రహముతో ఉండాలి
తనలో తాను ఆనందించాలి,

వివిక్తక్షేమశరణో మద్భావవిమలాశయః
ఆత్మానం చిన్తయేదేకమభేదేన మయా మునిః

ఏకాంతముగా ఉండే ఇంటిలోనే ఉండాలి, నా యందు భావం ఉంచి పరిశుద్ధమైన భావం కల మనసు కలవాడై ఉండాలి
ఆత్మ ఒక్కటే అని, అది కూడా నా స్వరూపమే అని ధ్యానం చేయాలి

అన్వీక్షేతాత్మనో బన్ధం మోక్షం చ జ్ఞాననిష్ఠయా
బన్ధ ఇన్ద్రియవిక్షేపో మోక్ష ఏషాం చ సంయమః

పక్కవారితో కలసి ఉంటే బంధము. జ్ఞ్యానముంటే మోక్షం అని భావించాలి
ఇంద్రియములను విచ్చలవిడిగా విహరింపచేయుటే బంధము, సంసారం
వాటిని నియమించుటే మోక్షం.

తస్మాన్నియమ్య షడ్వర్గం మద్భావేన చరేన్మునిః
విరక్తః క్షుద్రకామేభ్యో లబ్ధ్వాత్మని సుఖం మహత్

అరిషడ్వర్గాలను నియమించి ముని ఐన వాడు నా భావముతో సంచరించాలి. క్షుద్ర కోరికల యందు విరక్తి పొంది, దాని ఆత్మలో లభించే సుఖాన్ని అనుభవించాలి

పురగ్రామవ్రజాన్సార్థాన్భిక్షార్థం ప్రవిశంశ్చరేత్
పుణ్యదేశసరిచ్ఛైల వనాశ్రమవతీం మహీమ్

పురము గానీ గ్రామము గానీ వ్రజము గానీ భిక్ష కోసమే ప్రవేశించాలి
పుణ్య పర్వతములూ నదులూ ప్రదేశములూ మొదలైన వాటిని

వానప్రస్థాశ్రమపదేష్వభీక్ష్ణం భైక్ష్యమాచరేత్
సంసిధ్యత్యాశ్వసమ్మోహః శుద్ధసత్త్వః శిలాన్ధసా

ఎక్కువ సార్లు సన్యాసి వానప్రస్థాశ్రమ వాసుల నుంచే భిక్ష స్వీకరించాలి
శిలా వృత్తితో సంపాదించిన అన్నముతో పరిశుద్ధమైన మనసు గలవాడై మోహమును వదలిపెట్టి చక్కని సిద్ధిని పొందుతాడు

నైతద్వస్తుతయా పశ్యేద్దృశ్యమానం వినశ్యతి
అసక్తచిత్తో విరమేదిహాముత్రచికీర్షితాత్

కనపడుతున్న దంతా వాస్తవం అనుకోకు. ఇదంతా నశించేదే
దేనియందూ ఆసక్తిలేకుండా ఇహ పరములలో చేయవలసినది ఏదీ లేదు అన్న నిశ్చయానికి వచ్చి

యదేతదాత్మని జగన్మనోవాక్ప్రాణసంహతమ్
సర్వం మాయేతి తర్కేణ స్వస్థస్త్యక్త్వా న తత్స్మరేత్

మనసులో ఆత్మలో వాకుతో కాయముతో ఏర్పడినది, చూస్తున్నదీ చేస్తున్నదీ అనుభవిస్తున్నదీ పరమాత్మ మాయగా తెలుసుకొని పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యాన్ని పొంది, దేన్ని విడిచిపెట్టారో దాన్ని స్మరించరాదూ

జ్ఞాననిష్ఠో విరక్తో వా మద్భక్తో వానపేక్షకః
సలిఙ్గానాశ్రమాంస్త్యక్త్వా చరేదవిధిగోచరః

జ్ఞ్యాని కానీ విరక్తుడు కానీ దేనినీ కోరని నాభక్తుడు కానీ  ,
ఇలాంటి నియమాలనూ ఆశ్రమాలనూ విడిచిపెట్టి ఏ విధీ కనపడకుండా ఉంటాడు. వారు శాస్త్ర విధిని అనుసరించాల్సిన అవసరములేదు

బుధో బాలకవత్క్రీడేత్కుశలో జడవచ్చరేత్
వదేదున్మత్తవద్విద్వాన్గోచర్యాం నైగమశ్చరేత్

పండితుడైన వాడు పిల్లవాడిలా విహరించాలి
కుశలుడు జడుడిలా సంచరించాలి
పండితుడైనవాడు పిచ్చివాడిలా మాట్లాడాలి
వేద వ్రత పరుడు లభించినపుడు లభించిన దాన్ని మాత్రమే తీసుకోవాలి (ఇదే గోచర్య)

వేదవాదరతో న స్యాన్న పాషణ్డీ న హైతుకః
శుష్కవాదవివాదే న కఞ్చిత్పక్షం సమాశ్రయేత్

నిరంతరం వేదాధ్యయనం కానీ, వేద విషయాలను వాదించడము గానీ చేయకూడదు
పాప ఖండము గలవారితో హేతువాదులతో మాట్లాడరాదు
శుష్కవాదాల జోలికి వెళ్ళరాదు. అవి విన్నా ఏ ఒక్కరి పక్షాన్నీ సమర్ధించకూడదు

నోద్విజేత జనాద్ధీరో జనం చోద్వేజయేన్న తు
అతివాదాంస్తితిక్షేత నావమన్యేత కఞ్చన
దేహముద్దిశ్య పశువద్వైరం కుర్యాన్న కేనచిత్

జనులను చూచి భయపడరాదు
తాను జనులను భయపెట్టరాదు
ఎవరైనా అతిగా మాట్లాడినా అవమానించరాదు
శరీరం కోసం పశువులాగ ఏ ఒక్కరితో విరోధాన్ని కలిగించుకోరాదు

ఏక ఏవ పరో హ్యాత్మా భూతేష్వాత్మన్యవస్థితః
యథేన్దురుదపాత్రేషు భూతాన్యేకాత్మకాని చ

పరమాత్మ ఒక్కడే , అతనే సకల ప్రాణులయందూ ఉన్నాడు
జలం ఉన్న జలపాత్రలన్నిటిలో ఒక్కడే చంద్రుడు అనేకముగా కనపడతాడు

అలబ్ధ్వా న విషీదేత కాలే కాలేऽశనం క్వచిత్
లబ్ధ్వా న హృష్యేద్ధృతిమానుభయం దైవతన్త్రితమ్

ఒక్కోసారి సన్యాసికి సమయానికి ఆహారం దొరకదు. అంతమాత్రాన విషాదం పొందకూడదు
బాగా దొరికితే సంతోషించకూడదు
ధైర్యం కలిగి ఉండాలి
అంతా దైవాధీనముగా భావించాలి

ఆహారార్థం సమీహేత యుక్తం తత్ప్రాణధారణమ్
తత్త్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే

ప్రాణం నిలపడానికి కావలసిన ఆహారం కోసం ప్రయత్నించాలి తప్ప శరీరం బలవడం కోసం కాదు.
ఇలా స్వరూపాన్ని బాగా తెలుసుకొని ముక్తిని పొందుతాడు

యదృచ్ఛయోపపన్నాన్నమద్యాచ్ఛ్రేష్ఠముతాపరమ్
తథా వాసస్తథా శయ్యాం ప్రాప్తం ప్రాప్తం భజేన్మునిః

భగవత్ సంకల్పముతో లభించిన అన్నాన్నే తీసుకోవాలి. అది ఉత్తమ అన్నమే కావొచ్చు, అధమ అన్నం కావొచ్చు.

శౌచమాచమనం స్నానం న తు చోదనయా చరేత్
అన్యాంశ్చ నియమాఞ్జ్ఞానీ యథాహం లీలయేశ్వరః

ఎక్కడ దొరికితే అక్కడే వాసం, నివాసం. ప్రయత్నం చేయకుండా లభించే దానితోనే తృప్తి పొందాలి

శౌచం స్నానం ఆచమనం ఎవరో చెబితే చేయరాదు. సహజముగా ఆచరించాలి.సర్వ నియంత ఐన నేను ఎలా అన్ని నియమాలను ఆచరిస్తున్నానో వారూ అలాగే ఆచరించాలి.

న హి తస్య వికల్పాఖ్యా యా చ మద్వీక్షయా హతా
ఆదేహాన్తాత్క్వచిత్ఖ్యాతిస్తతః సమ్పద్యతే మయా

నన్నే నిరంతరం చూడడముతో వారికి ఇలాంటి సంబంధం అంతా తొలగిపోయి వారికి ఎటువంటి వికల్పమూ బేధమూ ఉండదు.
దేహాంతం వరకూ అలాగే ఉండాలి. తరువాత అలాంటి వాడు నన్నే చేరి నా దగ్గరే ఉంటాడు

దుఃఖోదర్కేషు కామేషు జాతనిర్వేద ఆత్మవాన్
అజ్జ్ఞాసితమద్ధర్మో మునిం గురుముపవ్రజేత్

దుఃఖములను మాత్రం కలిగించే కోరికల యందు విరక్తుడై మనో నిగ్రహం కలవాడై, నా ధర్మాన్ని తెలుసుకోకుండా ఉన్నట్లైతే, అటువంటి వాడు సన్యాసాశ్రమములో కూడా గురువునో మునినో ఆశ్రయించి,

తావత్పరిచరేద్భక్తః శ్రద్ధావాననసూయకః
యావద్బ్రహ్మ విజానీయాన్మామేవ గురుమాదృతః

తెలుసుకోవలసినది తెలుసుకునేంతవరకూ తెలియవలసిన దానిలో శ్రద్ధ కలిగి అసూయ లేని వాడై బ్రహ్మ జ్ఞ్యానం కలిగేంతర్వరకూ గురువును కూడా నాలాగే భావించాలి

యస్త్వసంయతషడ్వర్గః ప్రచణ్డేన్ద్రియసారథిః
జ్ఞానవైరాగ్యరహితస్త్రిదణ్డముపజీవతి

షడ్వర్గాన్ని జయించకుండా కృర ఇంద్రియ సారధ్యముతో జ్ఞ్యాన వైరాగ్యములు లేకుండా కేవలం బతుకు తెరువుకోసం త్రిదండాన్ని స్వీకరిస్తే

సురానాత్మానమాత్మస్థం నిహ్నుతే మాం చ ధర్మహా
అవిపక్వకషాయోऽస్మాదముష్మాచ్చ విహీయతే

 తనలో ఉన్న దేవతలనూ తనలో ఉన్న నన్నూ వంచన చేసినవాడు అవుతాడు. ధర్మాన్ని హత్య చేసినవాడవుతున్నాడు.
విపరీతమైన వైరాగ్యం కలగకుండా సన్యాసం స్వీకరిస్తే ఉభయ భ్రష్టుడవుతాడు


భిక్షోర్ధర్మః శమోऽహింసా తప ఈక్షా వనౌకసః
గృహిణో భూతరక్షేజ్యా ద్విజస్యాచార్యసేవనమ్

ఇంద్రియ నిగ్రహం అహింస తపమూ దీక్షా ఉండాలి
గృహస్థునికి ప్రాణులను రక్షించుటా యజ్ఞ్య
బ్రహ్మచారికి గురువును సేవించుట

బ్రహ్మచర్యం తపః శౌచం సన్తోషో భూతసౌహృదమ్
గృహస్థస్యాప్యృతౌ గన్తుః సర్వేషాం మదుపాసనమ్

శౌచమూ తపసూ సంతోషము ప్రాణుల యందు దయ , ఇవన్నీ బ్రహ్మచారికీ గృహస్థుకూ ఉంటాయి. గృహస్థుకు ఋతుమతిగా ఉన్న భార్యతో సంగమం ప్రత్యేక ధర్మం.అందరూ నన్ను ఉపాసించాలి

ఇతి మాం యః స్వధర్మేణ భజేన్నిత్యమనన్యభాక్
సర్వభూతేషు మద్భావో మద్భక్తిం విన్దతే దృఢామ్

ఈ రీతిలో నన్ను తన ధర్మముతో అనన్యభావనతో సేవిస్తే, సకల ప్రాణుల యందూ నా భావాన్ని ఉంచినట్లైతే నా భక్తిని పొందుతాడు

భక్త్యోద్ధవానపాయిన్యా సర్వలోకమహేశ్వరమ్
సర్వోత్పత్త్యప్యయం బ్రహ్మ కారణం మోపయాతి సః

అనపాయిని ఐన భక్తితో సర్వలోకేశ్వరుడైన నన్ను, సకల సృష్టి ప్రళయాలకు కారణమైన నన్ను చేరతాడు

ఇతి స్వధర్మనిర్ణిక్త సత్త్వో నిర్జ్ఞాతమద్గతిః
జ్ఞానవిజ్ఞానసమ్పన్నో న చిరాత్సముపైతి మామ్

ఇలా తన ధర్మాన్ని సక్రమముగా తెలుసుకొని ఆచరించి నా జ్ఞ్యానన్నీ స్థానాన్నీ తెలుసుకొని జ్ఞ్యానం కలిగి త్వరలోనే నన్ను చేరతాడు

వర్ణాశ్రమవతాం ధర్మ ఏష ఆచారలక్షణః
స ఏవ మద్భక్తియుతో నిఃశ్రేయసకరః పరః

ఇది వర్ణ ఆశ్రమ ఆచార లక్షణమైన ధర్మం. ఈ వర్ణాశ్రమ ఆచార ధర్మములు, నా భక్తి కలిగి ఉండి చేస్తే మోక్షాన్ని ఇస్తాయి. లేకుంటే అవి సంసారములోకి లాగుతాయి

ఏతత్తేऽభిహితం సాధో భవాన్పృచ్ఛతి యచ్చ మామ్
యథా స్వధర్మసంయుక్తో భక్తో మాం సమియాత్పరమ్

నీవు నన్ను ఏమి అడిగావో అది చెప్పా. తన ధర్మాన్ని తాను అనుష్ఠిస్తూ నా భక్తుడైన వాడు నన్ను చేరతాడు. కర్తృత్వాభిమానముతో ఆచరించరాదు

                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                  సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment