Saturday, September 21, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

                                                        ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీభగవానువాచ
యో విద్యాశ్రుతసమ్పన్నః ఆత్మవాన్నానుమానికః
మయామాత్రమిదం జ్ఞాత్వా జ్ఞానం చ మయి సన్న్యసేత్

ఇలాంటి వర్ణాల వలనా ఆశ్రమాల వలనా గురు శుష్రూష వలనా వేద ఇతిహాసాదుల అభ్యాసం వలన నా స్వరూపం బాగా తెలిసి మనో నిగ్రహం కలవాడై, సంశయాలన్నీ పోయి, ఈ ప్రపంచం అంతా మాయా మాత్రమే అని తెలుసుకుని, ఆ జ్ఞ్యానాన్ని కూడా నాకే అర్పించాలి. జ్ఞ్యానాన్ని కూడా సాధనం అని భావించరాదు. ప్రపంచం అంతా మాయ అని తెలుసుకోవడం వరకే జ్ఞ్యానము వలన పని.

జ్ఞానినస్త్వహమేవేష్టః స్వార్థో హేతుశ్చ సమ్మతః
స్వర్గశ్చైవాపవర్గశ్చ నాన్యోऽర్థో మదృతే ప్రియః

నేనే జ్ఞ్యానులకు ఇష్టున్ని. నేనే జ్ఞ్యానులకు స్వార్థాన్ని. జ్ఞ్యానులకు ఇష్టమైన హేతువును నేనే.
నేనే స్వర్గాన్నీ నేనే మోక్షాన్ని. జ్ఞ్యానులకు నా కంటే వేరే పొందవలసిన ప్రయోజనం లేదు
నేను కాని విషయం  జ్ఞ్యానులకు ప్రియం కాదు

జ్ఞానవిజ్ఞానసంసిద్ధాః పదం శ్రేష్ఠం విదుర్మమ
జ్ఞానీ ప్రియతమోऽతో మే జ్ఞానేనాసౌ బిభర్తి మామ్

జ్ఞ్యాన విజ్ఞ్యానం పొందిన వారు నా పదవే శ్రేష్టం అని భావిస్తారు;
అందుకే అందరికంటే జ్ఞ్యానే నాకు ప్రియతముడు
జ్ఞ్యాని జ్ఞ్యానముతో నన్నే భజిస్తాడు

తపస్తీర్థం జపో దానం పవిత్రాణీతరాణి చ
నాలం కుర్వన్తి తాం సిద్ధిం యా జ్ఞానకలయా కృతా

తపం తీర్థం జపం ధ్యానం ఇతర పవిత్రాలు అన్నీ కలిపినా, జ్ఞ్యానం యొక్క కలతో అందించే సిద్ధిని అందించలేవు.

తస్మాజ్జ్ఞానేన సహితం జ్ఞాత్వా స్వాత్మానముద్ధవ
జ్ఞానవిజ్ఞానసమ్పన్నో భజ మాం భక్తిభావతః

జ్ఞ్యానముతోనే నా స్వరూపాన్ని తెలుసుకుని, అవి అన్నీ కలవాడై ఈ భక్తి భావముతో నన్ను సేవించు

జ్ఞానవిజ్ఞానయజ్ఞేన మామిష్ట్వాత్మానమాత్మని
సర్వయజ్ఞపతిం మాం వై సంసిద్ధిం మునయోऽగమన్

జ్ఞ్యాన విజ్ఞ్యానం కలవాడై సర్వ యజ్ఞ్యపతి ఐన నన్ను పూజించి మునులు ఉత్తమ స్థితి పొందుతారు

త్వయ్యుద్ధవాశ్రయతి యస్త్రివిధో వికారో
మాయాన్తరాపతతి నాద్యపవర్గయోర్యత్

ఉద్ధవా,త్రివిధ వికారాలు గానీ, ఇతర వికారాలు గానీ నిన్ను ఆక్రమించవు
జన్మాదయోऽస్య యదమీ తవ తస్య కిం స్యుర్
ఆద్యన్తయోర్యదసతోऽస్తి తదేవ మధ్యే


జన్మా జరాధులతో నీకేమీ జరుగదు
జన్మ మరణం రోగం బాల్యం యవ్వనం వృద్ధాప్యం, ఇవేవీ లేవు. మొదలు ఏదుంటుందో చివర ఏదుంటుందో మధ్యనా అదే ఉంటుంది - జ్ఞ్యానమైనా అజ్ఞ్యానమైనా

శ్రీద్ధవ ఉవాచ
జ్ఞానం విశుద్ధం విపులం యథైతద్వైరాగ్యవిజ్ఞానయుతం పురాణమ్
ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తియోగం చ మహద్విమృగ్యమ్

జ్ఞ్యానం విశుద్ధమని చెప్పారు. పౌరాణిక జ్ఞ్యానాన్ని చెప్పారు
ఐనా ఇంకా సరిగా అర్థం కాలేదు. పురాణైక జ్ఞ్యానాన్ని మాకు చెప్పండి
మహానుభావులకు కూడా ఎంతో కష్టపడే భక్తి యోగాన్ని చెప్పండి

తాపత్రయేణాభిహతస్య ఘోరే సన్తప్యమానస్య భవాధ్వనీశ
పశ్యామి నాన్యచ్ఛరణం తవాఙ్ఘ్రి ద్వన్ద్వాతపత్రాదమృతాభివర్షాత్

ఈశా, సంసారం అనే ఈ దారిలో తాపత్రయముతో పరితపించేవారికి నీ పాద పద్మములు అనే గొడుకు కంటే వేరే రక్షకం ఏదీ నేను చూచుట లేదు. ఈ గొడుకు ఎండ నుంచి తప్పించడమే కాక, అమృతాన్ని కూడా వర్షిస్తుంది

దష్టం జనం సమ్పతితం బిలేऽస్మిన్కాలాహినా క్షుద్రసుఖోరుతర్షమ్
సముద్ధరైనం కృపయాపవర్గ్యైర్వచోభిరాసిఞ్చ మహానుభావ

కాలం అనే పాము కరిచి, చీకటి బావిలో పడి, క్షుద్ర సుఖం అనే కోరిక కలిగి ఉన్న వాడిని దయతో చూడు. మోక్ష సాధకములైన మాటలతో కాపాడు

శ్రీభగవానువాచ
ఇత్థమేతత్పురా రాజా భీష్మం ధర్మభృతాం వరమ్
అజాతశత్రుః పప్రచ్ఛ సర్వేషాం నోऽనుశృణ్వతామ్

నీవు అడిగిన ఈ ప్రశ్ననే ధర్మరాజు బీష్ముడిని అడిగాడు మేమందరమూ వింటూ ఉండగా అడిగాడు

నివృత్తే భారతే యుద్ధే సుహృన్నిధనవిహ్వలః
శ్రుత్వా ధర్మాన్బహూన్పశ్చాన్మోక్షధర్మానపృచ్ఛత

భారత యుద్ధం ఐన తరువాత మిత్రులు మరణించారు అన్న బాధతో ఉన్న ధర్మరాజుకు సకల ధర్మాలు ధర్మ బాగా తెలిసిన బీష్ముడు చెప్పాడు. అన్నీ విని ధర్మరాజు మోక్ష ధర్మాలు అడిగాడు

తానహం తేऽభిధాస్యామి దేవవ్రతమఖాచ్ఛ్రుతాన్
జ్ఞానవైరాగ్యవిజ్ఞాన శ్రద్ధాభక్త్యుపబృంహితాన్

బీష్ముడినుండి నేను విన్న ధర్మాలనే నేను నీకు ఇపుడు చెబుతున్నాను
జ్ఞ్యాన వైరాగ్య విజ్ఞ్యాన శ్రద్ధా భక్తుల చేత వృద్ధిపొందిన ఆ ధర్మమును

నవైకాదశ పఞ్చ త్రీన్భావాన్భూతేషు యేన వై
ఈక్షేతాథాకమప్యేషు తజ్జ్ఞానం మమ నిశ్చితమ్

9, 11, 5, 3 -- ఇదే ప్రపంచం.  నవ రంధ్రములు ఏకాదశ ఇంద్రియములు పంచ భూతములూ మూడు గుణములు, ఇదే ప్రపంచం.
వీటిలో ఏ ఒక్క దాన్ని చూడగలిగినా దాన్ని జ్ఞ్యానం అంటారు
ఒక్క దానితో ఏ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అది విజ్ఞ్యానం

ఏతదేవ హి విజ్ఞానం న తథైకేన యేన యత్
స్థిత్యుత్పత్త్యప్యయాన్పశ్యేద్భావానాం త్రిగుణాత్మనామ్

మూడు గుణాలతో వచ్చే అన్ని భావాలకూ సృష్టి స్థితీ నాశమూ, మూటినీ చూడాలి
ఒకటి సృజించబడేది, ఒకటి సృజించేది. ఈ రెండిటికీ ఆది మధ్యా అంతమూ ఉంటాయి

ఆదావన్తే చ మధ్యే చ సృజ్యాత్సృజ్యం యదన్వియాత్
పునస్తత్ప్రతిసఙ్క్రామే యచ్ఛిష్యేత తదేవ సత్

ప్రళయములో ఇవన్నీ పోయాక కూడా ఏది ఉంటుందో అదే సత్

శ్రుతిః ప్రత్యక్షమైతిహ్యమనుమానం చతుష్టయమ్
ప్రమాణేష్వనవస్థానాద్వికల్పాత్స విరజ్యతే

శృతీ, ఇతిహాసం, అనుమానం -  ఇవి ప్రమాణాలు. ఈ మూడిటి యందూ ఒకే సిద్ధాంతం తెలియబడడం లేదు కాబట్టి విరక్తి కలగాలి
శాస్త్రమే జ్ఞ్యాన మార్గమూ భక్తి మార్గమూ చెబుతుంది. అవి అన్నీ విని విరక్తితో అన్నీ వదలిపెట్టాలి

కర్మణాం పరిణామిత్వాదావిరిఞ్చ్యాదమఙ్గలమ్
విపశ్చిన్నశ్వరం పశ్యేదదృష్టమపి దృష్టవత్

బ్రహ్మవరకూ కూడా అన్ని కర్మలూ పరిణామ శీలములే (నశ్వరములే)
కనపడేది ఎలా నశిస్తుందో కనపడనిది కూడా నశిస్తుంది.
ఇక్కడి కర్మలు ఎలా నశిస్తున్నాయో, యజ్ఞ్య యాగాది కర్మలలో వచ్చిన ఫలం కూడా నశిస్తుంది

భక్తియోగః పురైవోక్తః ప్రీయమాణాయ తేऽనఘ
పునశ్చ కథయిష్యామి మద్భక్తేః కారణం పరం

నేను నీకు భక్తి యోగాన్ని ముందే చెప్పి ఉన్నాను. నా భక్తికి ఏమేమి కారణములో వాటిని మళ్ళీ చెబుతాను

శ్రద్ధామృతకథాయాం మే శశ్వన్మదనుకీర్తనమ్
పరినిష్ఠా చ పూజాయాం స్తుతిభిః స్తవనం మమ

అమృతం వంటి నా కథలో శ్రద్ధ ఉండడం భక్తి,, మాటి మాటికీ దానినే కీర్తిస్తూ ఉండాలి
నన్ను పూజించుటలో నిష్ఠ ఉండాలి
స్తోత్రాలతో నన్ను స్తుతి చేస్తూ ఉండాలి. నా సేవలో ఆదరం ఉండాలి

ఆదరః పరిచర్యాయాం సర్వాఙ్గైరభివన్దనమ్
మద్భక్తపూజాభ్యధికా సర్వభూతేషు మన్మతిః

నా సేవలో ఆదరం ఉండాలి. సాష్టాంగ దండ ప్రణామముతో వందనం చేయాలి
నన్ను పూజించుట కంటే నా భక్తులను పూజించుట ఎక్కువ

మదర్థేష్వఙ్గచేష్టా చ వచసా మద్గుణేరణమ్
మయ్యర్పణం చ మనసః సర్వకామవివర్జనమ్

అన్ని ప్రాణులలో నేనే ఉన్నానని తెలుసుకోవాలి
ఈ శరీరముతో ఆచరించే ప్రతీ పనీ నాకే అర్పించి
నీ వాక్కుతో నా గుణాలనే కీర్తించాలి
అన్ని కోరికలనూ విడిచిపెట్టిన మనసుని నా యందే అర్పించాలి

మదర్థేऽర్థపరిత్యాగో భోగస్య చ సుఖస్య చ
ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యద్వ్రతం తపః

నీవు సంపాదించిన సకల ధనములనూ ప్రయోజనములనూ వస్తువులనూ సుఖములనూ భోగములనూ నా కొరకు త్యాగం చేయాలి
యాగం కానీ, హోమం కానీ దానం కానీ జపం కానీ తపస్సూ వ్రతం అన్నీ నన్ను పొందడానికి మాత్రమే చేయాలి
సాంసారిక లౌకిక సుఖాల కోసం అవి చేయకూడదు

ఏవం ధర్మైర్మనుష్యాణాముద్ధవాత్మనివేదినామ్
మయి సఞ్జాయతే భక్తిః కోऽన్యోऽర్థోऽస్యావశిష్యతే

ఇలాంటి ధర్మములతో ఆత్మను నాకు అర్పించే మానవులకు నా యందు చలించని దృడమైన భక్తి కలుగుతుంది
ఈ భక్తి లభించిన తరువాత లభించది అంటూ ఏముంటుంది?

యదాత్మన్యర్పితం చిత్తం శాన్తం సత్త్వోపబృంహితమ్
ధర్మం జ్ఞానం స వైరాగ్యమైశ్వర్యం చాభిపద్యతే

ఈ మనసు ఆత్మలో అర్పించి, సత్వమును పెంచుకుని పరమ శాంతం ధర్మం వైరాగ్యం జ్ఞ్యానం, ఐశ్వర్యమునూ పొందుతుంది

యదర్పితం తద్వికల్పే ఇన్ద్రియైః పరిధావతి
రజస్వలం చాసన్నిష్ఠం చిత్తం విద్ధి విపర్యయమ్

పరమాత్మకు అర్పించకుంటే వాటి వెంటే ఇందిర్యములు పరిగెత్తుతాయి
పరమాత్మ యందు మనము ఉంచకుంటే రజస్సు (దుమ్ము) కూడిన మనసుగా గ్రహించు
నా యందు అర్పిస్తే అది పరిశుద్ధం

ధర్మో మద్భక్తికృత్ప్రోక్తో జ్ఞానం చైకాత్మ్యదర్శనమ్
గుణేస్వసఙ్గో వైరాగ్యమైశ్వర్యం చాణిమాదయః

నాయందు భక్తిని కలిగించేదే ధర్మం
జ్ఞ్యానం అంటే అన్ని ప్రాణులలో ఒకే తీరుగా పరమాత్మ వేంచేసి ఉన్నాడు. సర్వ ప్రాణులను భగవత్స్వరూపులుగా చూడడమే జ్ఞ్యానం.
సత్వాది గుణముల యందు కోరిక లేకుండుటే వైరాగ్యం
అణిమాది సిద్ధులే ఐశ్వర్యం

శ్రీద్ధవ ఉవాచ యమః కతివిధః ప్రోక్తో
నియమో వారికర్షణ కః శమః కో దమః కృష్ణ

యమం నియమ ఎన్ని విధాలు
శమం దమం అంటే ఏమిటి

కా తితిక్షా ధృతిః ప్రభో కిం దానం కిం తపః శౌర్యం
కిమ్సత్యమృతముచ్యతే కస్త్యాగః కిం ధనం చేష్టం

తితీక్షా దృతీ ఏమిటి
దానం తపసు శౌర్యం సత్యం ఋతం త్యాగం ధనం

కో యజ్ఞః కా చ దక్షిణా పుంసః కిం స్విద్బలం శ్రీమన్
భగో లాభశ్చ కేశవ కా విద్యా హ్రీః పరా కా శ్రీః

దక్షిణా యజ్ఞ్యం విద్యా శ్రీ బలం సుఖం దుఃకం
కిం సుఖం దుఃఖమేవ చ కః పణ్డితః కశ్చ మూర్ఖః
కః పన్థా ఉత్పథశ్చ కః కః స్వర్గో నరకః కః స్విత్

ఎవరు పండితుడు ఎవరు మూర్ఖుడు ఏది ఉత్తమ మార్గం ఏది చెడ్డదారి
స్వర్గమేది నరకమేది
బంధువు ఎవరు ఇల్లు అంటే ఏమిటి
శ్రీమంతుడు ఎవరు దరిద్రుడు ఎవరు లోభి ఎవరు
పరమాత్మ ఎవరు
నా ఈ ప్రశ్నలకు, నేనే మరచినవి ఏమైనా ఉంటే అవి కూడా చెప్పు

కో బన్ధురుత కిం గృహమ్క ఆఢ్యః కో దరిద్రో వా
కృపణః కః క ఈశ్వరః ఏతాన్ప్రశ్నాన్మమ బ్రూహి
విపరీతాంశ్చ సత్పతే శ్రీభగవానువాచ

అహింసా సత్యమస్తేయమసఙ్గో హ్రీరసఞ్చయః
ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైర్యం క్షమాభయమ్

శౌచం జపస్తపో హోమః శ్రద్ధాతిథ్యం మదర్చనమ్
తీర్థాటనం పరార్థేహా తుష్టిరాచార్యసేవనమ్

ఏతే యమాః సనియమా ఉభయోర్ద్వాదశ స్మృతాః
పుంసాముపాసితాస్తాత యథాకామం దుహన్తి హి

అహింస సత్యం అస్తేయం అసంగం సిగ్గు అసంచయం ఆస్తిక్యం బ్రహ్మ చర్యం మౌనం
స్థైర్యం క్షమ అభయం శౌచం జపం తపం హోమం శ్రద్ధ ఆతిధ్యం నా అర్చనం
తీర్థాటనం ,పరార్థాన్ని కోరుట దృష్టి ఆచార్య సేవనం, ఇవన్నీ యమములు

శమో మన్నిష్ఠతా బుద్ధేర్దమ ఇన్ద్రియసంయమః
తితిక్షా దుఃఖసమ్మర్షో జిహ్వోపస్థజయో ధృతిః

రెండికీ ఒక్కో దానికీ పన్నెండేసి ఉంటాయి
యమ నియమాలను జాగ్రత్తగా ఉపాసిస్తే కోరిన అన్ని కోరికలనూ తీరుస్తుంది
నా యందు ఉనికే దమము. బుద్ధి నాయందు ఉంచుటే దమము. ఇంద్రియాలను నియమించుట దమం
దుఃఖాన్ని సహించుట తితీక్ష
జిహ్వ ఉపస్థలను నియమించుట దృతి

దణ్డన్యాసః పరం దానం కామత్యాగస్తపః స్మృతమ్
స్వభావవిజయః శౌర్యం సత్యం చ సమదర్శనమ్

ఎవరినీ శిక్షించకుండా ఉండుట దానం
అన్ని కోరికలనూ విడిచిపెట్టుటే తపస్సు
మన మనసును మనం గెలుచుటే శౌర్యం
అంతా పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవడమే సత్యం

అన్యచ్చ సునృతా వాణీ కవిభిః పరికీర్తితా
కర్మస్వసఙ్గమః శౌచం త్యాగః సన్న్యాస ఉచ్యతే

చక్కని వాక్యాన్ని ఋతం అంటారు
కర్మల యందు మనసులో సంగం లేకుండా ఉండుట శౌచం
సన్యాసాన్ని త్యాగం అంటారు.

ధర్మ ఇష్టం ధనం నౄణాం యజ్ఞోऽహం భగవత్తమః
దక్షిణా జ్ఞానసన్దేశః ప్రాణాయామః పరం బలమ్

నేనే యజ్ఞ్యము. జ్ఞ్యానాన్ని అందించుటే దక్షిణ
ప్రాణాయామమే పరమైన బలము

భగో మ ఐశ్వరో భావో లాభో మద్భక్తిరుత్తమః
విద్యాత్మని భిదాబాధో జుగుప్సా హ్రీరకర్మసు

నా యొక్క ఈశ్వర భావమే భోగం
నా భక్తే లాభము
అభేధ జ్ఞ్యానమే విద్య
చేయకూడని పనులను అసహ్యించుకొనుటే సిగ్గు

శ్రీర్గుణా నైరపేక్ష్యాద్యాః సుఖం దుఃఖసుఖాత్యయః
దుఃఖం కామసుఖాపేక్షా పణ్డితో బన్ధమోక్షవిత్

అనాసక్తి మొదలైన గుణాలే శ్రీ.
సుఖమునూ దుఃఖమునూ రెండిటినీ దాటుటే సుఖము
కోరికలతో సుఖాన్ని పొందాలనుకోవడమే దుఃఖము
బంధమూ మోక్షమూ తెలిసినవాడే పండితుడు

మూర్ఖో దేహాద్యహంబుద్ధిః పన్థా మన్నిగమః స్మృతః
ఉత్పథశ్చిత్తవిక్షేపః స్వర్గః సత్త్వగుణోదయః

శరీరమే ఆత్మ అనే బుద్ధి ఉన్నవాడే మూర్ఖుడు
నన్ను చేర్చేదే మార్గము
మనసును ఇష్టం వచ్చినట్లు విహరింపచేయుటే చేడ్డదారి
సత్వ గుణములో ఉండడమే స్వర్గము

నరకస్తమౌన్నాహో బన్ధుర్గురురహం సఖే
గృహం శరీరం మానుష్యం గుణాఢ్యో హ్యాఢ్య ఉచ్యతే

తమో గుణాన్ని పెంచుట నరకము
బంధువు గురువు నేనే
ఇల్లు అంటే శరీరము
ఉత్తమ గుణములు కలవాడే ధనవంతుడు

దరిద్రో యస్త్వసన్తుష్టః కృపణో యోऽజితేన్ద్రియః
గుణేష్వసక్తధీరీశో గుణసఙ్గో విపర్యయః

సంతృప్తి లేనివాడే దరిద్రుడు
ఇంద్రియ జయం లేనివాడే లోభి
గుణముల యందు ఆసక్తి లేనివాడే ఈశ్వరుడు
గుణముల యందు ఆసక్తి కలవాడు పనివాడు/సేవకుడు

ఏత ఉద్ధవ తే ప్రశ్నాః సర్వే సాధు నిరూపితాః
కిం వర్ణితేన బహునా లక్షణం గుణదోషయోః
గుణదోషదృశిర్దోషో గుణస్తూభయవర్జితః

ఉద్ధవా, నీవు అడిగిన అన్నిటినీ నిరూపించాను
ఇదంతా ఎందుకు? ఇది గుణమూ ఇది దోషం అన్న విచారం వద్దు
గుణమూ దోషమూ అని ఆలోచించకుండా ఉండుటే గుణం
ఆ ఆలోచన పెట్టుకోవడమే దోషం
గుణదోషాలను చూచుటే దోషము
గుణ దోష బుద్ధి లేకపోవుటే గుణము

                                                          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                          సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment